Followers

Sunday 7 April 2013

గన్నేరుపూల గాలి


తేనెటీగలు ముసిరిన పున్నమి 
యాప కొమ్మల్లో 
కండ్ల లోపలి గవ్వల్లో 
మబ్బు చిమ్మిన గాలి 
పుంజు రెక్కల గాలి 

గన్నేరు కాయలు దొర్లినా 
ఉలిక్కిపడుతున్నది చీకటి 
వచ్చి వెల్లిండ్రేమో వాళ్లు 
గాలిమైకం మరొక్కసారి 

మసక కప్పుకుని 
దారి తప్పింది పిట్ట పిల్ల 
గుండ్రంగా తిరిగి తిరిగీ 
కనబడని పాట చుట్టూ 
వొరిగి జరిగీ 

ఆకాశపు రాత్రి తెల్లగా 
వొలుచుకున్నాదింక నలుపుని 
అనుమాన్ల గుడి చుట్టూ 
చప్పుడు చేయని చేతులు 
కనుపాపల్ని నిమిరే చేతులు 

పసుపు పచ్చని రాయి 
గురకపెడుతుంది గుండెలో వొక మూల 
దయ్యమో దేవతో 
కలలోపలి కునుకో... 

గచ్చకాయల కాంతి 
వానరాశుల కాంతి 
ఏడుపు కాగిన వాసన 
మత్తులోంచి తన్నుకొచ్చే వాసన 

రారా... అయ్యా ... 
వెలిగించు కొన్ని దీపాలు 
దిద్దించు దుఃఖాన్ని 
గన్నేరుపూల గాలి 
నిగనిగలుగా 
జరంత వెలుగులో 

Saturday 6 April 2013

కాకి దుఃఖం


నీ చిలుము గుండె చప్పుడు 
వినిపించదు నాకైనా 
రక్తలయల్లోని పాటలు వింటున్నావా 
మోసపోయావా 
సూత్రాలన్నీ తెగి స్కలించిన బాధలూ 
కనురెప్పలు మూసుకుంటాయా 

దుగుట్లో గడ్డ కట్టిన కన్నీరు 
ఈ 
కలల్నుంచి తెగిపడిన మాంసం ముక్క 
చేదు చేదు చేదు 
విరిగిపోయావా దారి కరిగి 

ఎవర్నని ప్రేమించాలి 
రెండు దేహాలొదిలిన ఊపిరి కాలాలకి 
అగ్గి పెట్టాలి 
మోసం 
నీ మోసం నా మోసం 
గుర్తెరిగిన మోసం మనందరిదీ 
విహ్వలించావా నమ్మకంతో 
వెన్నెముక తనని ఏ రంపంతో కోసుకుందో 
నన్నడగకు 

భాషంతా చెదపురుగు 

అసలిది అంతరించిపోతుంది 
పెనుగాయమొక్కటే బతుకు 

ఇప్పటికైనా వినిపించానా 

గొంగడి పురుగును 
గ్నాపకాలపై తిండి కోసం పాకుతూ 

సగం కన్నీరు 
సగమే మృతి 
బాధలు పడే వాడి 
కూలిన తొలి నిశ్శబ్దం 

ఇప్పటికిది 
ఏమీ వినిపించదు