Followers

Sunday 7 April 2013

గన్నేరుపూల గాలి


తేనెటీగలు ముసిరిన పున్నమి 
యాప కొమ్మల్లో 
కండ్ల లోపలి గవ్వల్లో 
మబ్బు చిమ్మిన గాలి 
పుంజు రెక్కల గాలి 

గన్నేరు కాయలు దొర్లినా 
ఉలిక్కిపడుతున్నది చీకటి 
వచ్చి వెల్లిండ్రేమో వాళ్లు 
గాలిమైకం మరొక్కసారి 

మసక కప్పుకుని 
దారి తప్పింది పిట్ట పిల్ల 
గుండ్రంగా తిరిగి తిరిగీ 
కనబడని పాట చుట్టూ 
వొరిగి జరిగీ 

ఆకాశపు రాత్రి తెల్లగా 
వొలుచుకున్నాదింక నలుపుని 
అనుమాన్ల గుడి చుట్టూ 
చప్పుడు చేయని చేతులు 
కనుపాపల్ని నిమిరే చేతులు 

పసుపు పచ్చని రాయి 
గురకపెడుతుంది గుండెలో వొక మూల 
దయ్యమో దేవతో 
కలలోపలి కునుకో... 

గచ్చకాయల కాంతి 
వానరాశుల కాంతి 
ఏడుపు కాగిన వాసన 
మత్తులోంచి తన్నుకొచ్చే వాసన 

రారా... అయ్యా ... 
వెలిగించు కొన్ని దీపాలు 
దిద్దించు దుఃఖాన్ని 
గన్నేరుపూల గాలి 
నిగనిగలుగా 
జరంత వెలుగులో 

Saturday 6 April 2013

కాకి దుఃఖం


నీ చిలుము గుండె చప్పుడు 
వినిపించదు నాకైనా 
రక్తలయల్లోని పాటలు వింటున్నావా 
మోసపోయావా 
సూత్రాలన్నీ తెగి స్కలించిన బాధలూ 
కనురెప్పలు మూసుకుంటాయా 

దుగుట్లో గడ్డ కట్టిన కన్నీరు 
ఈ 
కలల్నుంచి తెగిపడిన మాంసం ముక్క 
చేదు చేదు చేదు 
విరిగిపోయావా దారి కరిగి 

ఎవర్నని ప్రేమించాలి 
రెండు దేహాలొదిలిన ఊపిరి కాలాలకి 
అగ్గి పెట్టాలి 
మోసం 
నీ మోసం నా మోసం 
గుర్తెరిగిన మోసం మనందరిదీ 
విహ్వలించావా నమ్మకంతో 
వెన్నెముక తనని ఏ రంపంతో కోసుకుందో 
నన్నడగకు 

భాషంతా చెదపురుగు 

అసలిది అంతరించిపోతుంది 
పెనుగాయమొక్కటే బతుకు 

ఇప్పటికైనా వినిపించానా 

గొంగడి పురుగును 
గ్నాపకాలపై తిండి కోసం పాకుతూ 

సగం కన్నీరు 
సగమే మృతి 
బాధలు పడే వాడి 
కూలిన తొలి నిశ్శబ్దం 

ఇప్పటికిది 
ఏమీ వినిపించదు 

Friday 29 March 2013

మలయ విరాగ మారుతం

ఈ స్వరం బొడ్డును కోసిందెవ్వరు 
గొంతుకు తొలిసారిగ 
                           గమక గన్నేరు పూసిందని 
                           చూసిందని 
                           చెప్పిందెవ్వరు 
రాత్రిని కౌగిలించుకున్న మొదటి ఝాము పాటెప్పుడు 
దండంపెట్టుకుందీ... యాలాడిందీ... 
చీకటి తన నుదుటి బొట్టును 
                           అప్పుడెట్లా సవరించుకుందీ... 

నీకు లాగ... 
మనకొక కలుగులాగ 
మనసొక కరిహంస కాంతిగా... 
చైత్ర గంధంగా 
గులేబకావళి పువ్వుగా 
కిరణ రంజనిగా 
గగనమెక్కిందీ... తూలి... కూలి... 

అమ్మా... నువ్వు పాటతో కన్నందుకు 
వెయ్యి జన్మల రుణమెక్కిననే... 
నీ మెట్టెలనే నాకుతూ బతుకుతూన్న 

పాటై... మాటిచ్చిన నమ్మకమే 
                       అఘోరమయ్యింది 
అవమానాలకు అడ్డుపడింది 
ఆపతిలో ఆదుకుంటున్నది 


ఎటు దొర్లినా... 
ఖేదపడి రక్త మోడుతున్నానా... 
ఖండిత 'సంగతి'నై 
పాలు చేపుతున్నానా భూమికి 
భూమిలోపలి ఔషధాలకు 
మొలకెత్తుతున్నానా 
నీళ్ళు పోస్తున్నానా 

విహ్వలమెక్కలేదు 
ఆరోపణ దొరకలేదు 
లోపల... 
ఎండిన ఇస్తరాకు మీది నీటి బొట్టుగా 
ఒక్కడ్నే స్వర పరుచుకుంటున్నాను 
భూమిని 
భూమిలోపలి వేల ఖనిజాల్ని 

Thursday 28 March 2013

చిరువి

నల్ల గొంగలి కప్పుకున్న కురుమెల్లన్నా 
                          చందమామా... 
పసుపు నీళ్ళాడుతున్న పజ్జొన్న చెల్కా 
you are a pain pain pain
and a pain within a song
and a gain within a pain

వానలోంచి చూస్తున్నాను 
                తాటి గుట్టల్ని 

రక్తంతో తడుస్తున్న జాజు బాటల్ని 
మలిపిన ఆనకట్టల్ని నదుల్ని 
నదిలో కొట్టుకొస్తున్న అవయవాలని 

ఈ శూన్యం నిరీక్షణ... 
తెగిన దేహం 
విభజన గీతం 
ధ్వంస రుతుపవనం... నాదంటే... నాదే... 

రండిరా అయ్యా... కప్పండి నా మీద 
రక్తంతో ఎండిన బట్టల్ని 
చిరిగిన చీరల్ని 
అంటుకుంటున్న జెండాల్ని... 
కుమ్మరించండి నా మీద పగిలిన గాజుల్ని 
అనివార్యంగా 
వ్యభిచార సహజీవనమేందిరా 
రాజకీయ యక్షుడా... 
కపట దేవుడా 

కురుమెల్లన్నా... చందమామా 
                     చూస్తున్నావా... 
ఎందుకీ దేహం కంపరమెత్తుతుంది 
నెత్తిమీద కంపమోపులాగా 
                    ఈ మాటలెందుకు బరువెక్కుతున్నాయి 
నా ప్రశ్నలెందుకు ఉరితాళ్ళను వెతుక్కుంటున్నాయి 
                    సైనైడ్లను నాకుతున్నాయి 
నా జానాబెత్తెడు దుఃఖం 
                    ఈ దేశమంతా కోసుకుని పోతుందెందుకు 
పగులుతుందెందుకు మానవ భూమి 
లో... జీవుడెందుకు మూలుగుతున్నాడు 
ఎందుకు నాకు విముక్తంటే అనురక్తి 
                  అంగజ సుఖమంత సాదర భక్తి 
తెలంగాణోన్నయినందుకు 
నా జన్యు రహస్యమేందిరా 
బొమ్మగోని సామీ... పరాంకుశమా 
వైష్ణవ ముస్తాదర్... 

కణ కణం నేనెందుకు కదిలిపోతుంటాను 
నా నీడకే ఎందుకు కాష్టం పెట్టుకుంటాను 
బుక్కెడు కోపాన్నావుతుంటాను... 
అసత్యపు పదమూ 
అసహ్యపు బులెట్టూ 
కడుపులోపలి నట్టా 
ఒక్కటే నాకు...   


(చిరువి = గ్రీకు మైథాలిజీలో సగం దేహం గల పాత్ర)

Monday 25 March 2013

రెండు ఊరవిష్కె మాటలు

నీ రేకులింటికి 
కొన్ని వందలసార్లు 
వచ్చి ఉంటానేమో... 

పొద్దుటి గాలిలో తడిసి 
వెలుతుర్లో ఎండి 
నీ బాదం చెట్టు చేతి వేళ్ళను తాకి 
కిటికీని తడిమేందుకు 
కొన్ని వందలసార్లు 
ఉండడానికి వచ్చి ఉంటానేమో... 

నాకొక లయ ఉందని 
నీ ఇంటికి తెలుసు 
నా లోపలొక నిర్లయ ఉందని 
నీ కంటికీ తెలుసు 
నీ కిటికీ పక్క గోడ వెనుక 
శీర్షాసనం వేసుకున్న అద్దం... 
                                          ఒకటుండేది 

దానిలో 
ఒక సరస్సుండేది 
ఆ సరస్సులో 
కొన్ని కాగడాలుండేవి 
ఆ కాగడాల వెలుతుర్లో 
కొన్ని గుజ్జెన గూళ్ళు... ఉండేవి 
ఆ అద్దం... ఒక చిత్రలీల 
నా ముక్కును అది పట్టి ఊగించేది 
శబ్దంతో అర్థంలేని 
పురాతన పర్వాలు రాలేవి... 

నేను 
ఊరవిష్కెనే కావొచ్చు 
కానీ 
అలహాబాద్ కుంభమేళా నుంచి 
                                        ఎగిరొచ్చిన 
                                                         నాగసాధునే అవ్వొచ్చు 
లేక అక్కడి నగ్న వృద్ధ సాధకురాలి 
                                                    ఆత్మనూ అవ్వొచ్చు 

నీ నగరంలో 
నేను లింగధారణ చేద్దామని వస్తే 
కిటికీ లేదు 
కిటికీ పక్కన గోడ లేదు అద్దం లేదు 
అద్దంపైన రేకులాకాశమూ లేదు 
ఆకాశం కింద 
బాదామాకుల నడి వయసు చెట్టూ లేదు
దాని మెనోపాజందమూ లేదు 

Thursday 7 March 2013

మల్లెల తీర్థం


ఈ   వనభూమి కానుకగా
కొన్ని చినుకుల్ని చిలకరించింది
తన పిల్లలతో వచ్చి
కాండవ వన దహన హృదయమ్మీద…
దహనం రెట్టింపైంది
రక్తంలో కొత్త లిపి పరిణమించింది
ఎముకల్లోపలి గుజ్జు
ఏకాంతాన్ని చెక్కుకుంటూంది
నా వందల దుఃఖరాత్రుల
పారవశ్యాల చుట్టూ
ఒక పచారి తీగ …లాగ…
తెలుసు నాకు తెలుసు నాకు
నా లోపల వొక స్త్రీ దేహముందని తెలుసు
జువ్వికొమ్మగా కనునీలాలను
                               పెనవేసుకుందనీ తెలుసు
ఆమె ముద్దుతో నా మాటకు
కొబ్బరి నీళ్ళ సువాసన వొచ్చిందనీ తెలుసు
గాలిలో దూది మొగ్గ ఎగిరినట్టుగా
వుంది నిశ్శబ్దం
ఇది క్షేత్రమో తీర్థమో
బట్టలు తొడుక్కోలేదింకా
అదింకా అమ్మ పాలకోసం వెదుక్కోలేదు
కొన్ని అమూర్త ఛాయలు
కనుపాపలపై గురగురమంటూ
ఈ శబ్దసందర్భం… నిద్రాభంగం కలలకు
దూరాన్నుంచి వచ్చాను
అక్కడెక్కడ్నుంచో
అవుటర్ రింగ్ రోడ్డుల్లోంచి
ఫ్లైవోవర్ల ఉరితాళ్ళల్లోంచి
పువ్వులా జారిపడ్డాను…
ఇక్కడ…
జనసమ్మర్ధం లేని కలలు
వాక్యసమ్మర్ధం కాలేని జనం
శూన్యమవుతూన్న కణం
రాలిపోయే సుఖం
అలల కంటి కొసపై ఊయలూగే కిరణం
గాలి కౌగిలింత
దాని లోపల ఔషధాల సువాసన
భూమి నిద్ర వాసన
చర్మం లోపలి ద్రవఫలకాలపైన
తడిసిన ఆకులు అలమలు
పిందెలు మొగ్గరేకులూ  నీటి బుగ్గలూ
ఎగిరే… ఎవ్వరూ…
నా పలుదెసలా
అన్నీ నేనేనా
నేనే నా వనాన్నా
వనాన్ని భోగిస్తున్న మృణ్మయ పేటికనా
లోతుల ఇక పాడనా…
ఈ వనాన…
“చెండూ గరియమ్మ బోనాల మీద
ఎవరొస్తుంర్రే పిల్లా… ఎవరొస్తుంర్రే…
చెండూ గరియమ్మ బోనాల మీద
పిలగో…
పద్యమొస్తుందే జుమ్ జుమ్ పద్యమొస్తుందే
చెండూ గరియమ్మ బోనాల మీద
పిల్లా
పాట వొస్తుందే పాటల గద్యమొస్తుందే…
మాట వొస్తుందే…
మాయల మూట వొస్తుందే…”
అంటూ…


http://www.saarangabooks.com/magazine/?p=280

Wednesday 6 March 2013

శకుడు

అవున్నేను ఎక్కడికి పోవాలె ... 
వెలుగు నలిగిన దారి మూసిన 
చర్మతీరం ... ఖర్మభారం... 
కనుగవ్వన నిద్రించిన ప్రియురాలు నత్త 
నిద్రలోనే మరణించింది 
అమ్మ వొదిలేసి పోయింది 
పెండ్లాం వెన్నుపోటు పొడిచింది 
పిల్లలు బట్టలూడదీసినారు... 
నమ్ముకున్నోళ్ళు నాకేసిపోయారు... 
భగ్నజపం చేస్తున్నాను... 
వనం కాలిపోయింది 
బూడిద పుట్టింది ... 
పువ్వు మొగ్గలోకి దూకి జన్మహత్య చేసుకుంది 
కన్రెప్పలు కళ్ళను పొడిచి తింటున్నయ్ 
కథలు నిజమయ్యి కల్పన కాలుష్యమయ్యింది 
రాత్రి పగటిని వాంతి చేసుకుంటోంది 
దేవుడు డ్రగ్ ఎడిక్టయ్యాడు 
ద్వేషం తాంత్రికంగా ప్రేమయ్యింది 
ప్రేమ యాంత్రికంగా శోకమయ్యింది 
భూమి యోని వాటికయ్యింది 


అవున్నేను ఎక్కడికని పోవాలె ... 
నిరీంద్రియ స్వప్నం ఉందా 
జన్మ మొదలయ్యిందా... 
ఉంచుకున్నది ప్రసవించిందా... 
ముంచిందా దాని పాలకడలి కనలి దారిచ్చిందా... 
నెగడు మాట్లాడిందా... 
వాక్యం నవ్విందా... 
అర క్షణమైనా చలించిన దుఃఖం ఉచ్చపోసుకుందా... 
లోపల్లోపల ఉద్యానవనాన 
గోధుమ వర్ణం చంద్రుడు... ఉదయించాడా... 
శుభ్రం చేశాడా... నాల్కెను... 
మనుషులందరూ చచ్చిపోయిన్రా... లేదా 

http://www.andhrajyothy.com/i/2012/dec/31-12-31vividha.pdf

Tuesday 12 February 2013

తంత్రీ…తాంత్రికుడు


1
మహా గురువుల మహా పాద యాత్ర
శ్రవణేంద్రియానికి నిర్వాణ సుఖం
ఒక చీమ నిద్రలోకి
కంజు పిట్టల కలల్లోకి
ఎండిన భూమి సణుగుడులోకి
బర్రెల పుర్రెల ప్రాణ సొరంగాల్లోకి
గాలి గాథల్లోకి
నీ సంగీతం…
2
సమాధులే మబ్బుల్లోకి లేచి
ప్రాణాయామాలు చేసినట్టు
మానస సరోవరాలు ముచ్చట్లు చెప్పినట్టు
గాయాలు చప్పట్లు కొట్టి
తంత్రులు యక్షులై ఆడి
గునుగుపూల చుంబన పరిస్పర్శలు
అంతా…
నీ సంగీతం ….
3
మంచు పూలు పసుపు పూసుకొని
నూనె రాసుకొని
కాటుకని కళ్ళకు పెట్టుకున్నట్టు
సరస్వతీ నది…మళ్ళీ ఎక్కడో పుట్టి
గమకాల్లో దుఃఖించినట్టు
సశబ్దంగా…
4
నీ సింధుభైరవి నా ఆదిమ గుహ
ప్రాచీ సంధ్య
గగనద్వారం
పాలపుంత ఊయల
5
తంత్రిని దేహంగా దాల్చిన
బాటసారీ…
నువ్విక్కడ పుట్టనే లేదు
నువ్విక్కడ చచ్చిపోనూ లేదు
నీ స్వరతంత్రమంతా…బ్రహ్మ కపాలాన్ని
పేల్చిన ఊపిరి సంతకం
కొన్ని పగోడాలపైన వివశంగా
కురిసే మలిఝాము వెన్నెల
గడచిపోయిన శతాబ్దాలూ
మునిగిపోయిన నాగరికతలూ
నీ స్వరాల్లో పూచిన మొగ్గలూ …వాగులూ
ఆకాశంలోని రవ్వలూ…గవ్వలూ…
6
నేను కేవలం వినేవాడ్ని
నీ స్వేద రంధ్రులు …అంగజ జలపాతాలు
నీ సంగీతం…
ప్రవక్త ఆకలి…
జీబ్రాన్ ఏకాంతం…
7
నువ్వు తిలక్ కామోద్ వి.
నువ్వు యమునా తిలకానివి
నువ్వు ‘శ్రీ’ …శర్వానివి
నువ్వు నిద్రని కనే రాత్రివి
రాత్రిని కనే రాగానివి…
8
నీ సితార్
కాశీ శ్మశానాల…. పక్కన
గంగలో తేలే పడవ
దానిపై కూర్చుంది భూమి.
కడుపుతో వుండి
కనబోయే వాగ్గేయకారుడి కోసం
కడుపును నిమురుకుంటూంది.
9
నాయ్ నా…
నువ్వు చందమామ చుట్టూ కట్టిన
కాంతి తోరణానివి
నా కామాఖ్య భృకుటివివి
జన్మ పేటికవు
శంకరుని
రవివి.

(పండిట్ రవిశంకర్ స్మృతిలో…)

http://vaakili.com/patrika/?p=644