Followers

Monday 25 March 2013

రెండు ఊరవిష్కె మాటలు

నీ రేకులింటికి 
కొన్ని వందలసార్లు 
వచ్చి ఉంటానేమో... 

పొద్దుటి గాలిలో తడిసి 
వెలుతుర్లో ఎండి 
నీ బాదం చెట్టు చేతి వేళ్ళను తాకి 
కిటికీని తడిమేందుకు 
కొన్ని వందలసార్లు 
ఉండడానికి వచ్చి ఉంటానేమో... 

నాకొక లయ ఉందని 
నీ ఇంటికి తెలుసు 
నా లోపలొక నిర్లయ ఉందని 
నీ కంటికీ తెలుసు 
నీ కిటికీ పక్క గోడ వెనుక 
శీర్షాసనం వేసుకున్న అద్దం... 
                                          ఒకటుండేది 

దానిలో 
ఒక సరస్సుండేది 
ఆ సరస్సులో 
కొన్ని కాగడాలుండేవి 
ఆ కాగడాల వెలుతుర్లో 
కొన్ని గుజ్జెన గూళ్ళు... ఉండేవి 
ఆ అద్దం... ఒక చిత్రలీల 
నా ముక్కును అది పట్టి ఊగించేది 
శబ్దంతో అర్థంలేని 
పురాతన పర్వాలు రాలేవి... 

నేను 
ఊరవిష్కెనే కావొచ్చు 
కానీ 
అలహాబాద్ కుంభమేళా నుంచి 
                                        ఎగిరొచ్చిన 
                                                         నాగసాధునే అవ్వొచ్చు 
లేక అక్కడి నగ్న వృద్ధ సాధకురాలి 
                                                    ఆత్మనూ అవ్వొచ్చు 

నీ నగరంలో 
నేను లింగధారణ చేద్దామని వస్తే 
కిటికీ లేదు 
కిటికీ పక్కన గోడ లేదు అద్దం లేదు 
అద్దంపైన రేకులాకాశమూ లేదు 
ఆకాశం కింద 
బాదామాకుల నడి వయసు చెట్టూ లేదు
దాని మెనోపాజందమూ లేదు 

2 comments:

హెచ్చార్కె said...

సిద్దార్థ, నువ్వు ఇప్పటికి పోస్ట్ చేసిన మూడు పద్యాలు చదివాను. మూడూ చాల బాగున్నయ్. ఎందుకు బాగున్నయ్యో అలోచించుకుంటూ గడిపేస్తానిక ఈ దినాన్ని. ఇప్పుడింకా ఉదయం ఐదు గంటలే.

Anonymous said...

బావుందండి ,
మనసుండాలి గాని
లింగానిదేముందండి
కవితలో మనసు ,సొగసుగా
గుబాలిస్తోందండి