Followers

Thursday 28 March 2013

చిరువి

నల్ల గొంగలి కప్పుకున్న కురుమెల్లన్నా 
                          చందమామా... 
పసుపు నీళ్ళాడుతున్న పజ్జొన్న చెల్కా 
you are a pain pain pain
and a pain within a song
and a gain within a pain

వానలోంచి చూస్తున్నాను 
                తాటి గుట్టల్ని 

రక్తంతో తడుస్తున్న జాజు బాటల్ని 
మలిపిన ఆనకట్టల్ని నదుల్ని 
నదిలో కొట్టుకొస్తున్న అవయవాలని 

ఈ శూన్యం నిరీక్షణ... 
తెగిన దేహం 
విభజన గీతం 
ధ్వంస రుతుపవనం... నాదంటే... నాదే... 

రండిరా అయ్యా... కప్పండి నా మీద 
రక్తంతో ఎండిన బట్టల్ని 
చిరిగిన చీరల్ని 
అంటుకుంటున్న జెండాల్ని... 
కుమ్మరించండి నా మీద పగిలిన గాజుల్ని 
అనివార్యంగా 
వ్యభిచార సహజీవనమేందిరా 
రాజకీయ యక్షుడా... 
కపట దేవుడా 

కురుమెల్లన్నా... చందమామా 
                     చూస్తున్నావా... 
ఎందుకీ దేహం కంపరమెత్తుతుంది 
నెత్తిమీద కంపమోపులాగా 
                    ఈ మాటలెందుకు బరువెక్కుతున్నాయి 
నా ప్రశ్నలెందుకు ఉరితాళ్ళను వెతుక్కుంటున్నాయి 
                    సైనైడ్లను నాకుతున్నాయి 
నా జానాబెత్తెడు దుఃఖం 
                    ఈ దేశమంతా కోసుకుని పోతుందెందుకు 
పగులుతుందెందుకు మానవ భూమి 
లో... జీవుడెందుకు మూలుగుతున్నాడు 
ఎందుకు నాకు విముక్తంటే అనురక్తి 
                  అంగజ సుఖమంత సాదర భక్తి 
తెలంగాణోన్నయినందుకు 
నా జన్యు రహస్యమేందిరా 
బొమ్మగోని సామీ... పరాంకుశమా 
వైష్ణవ ముస్తాదర్... 

కణ కణం నేనెందుకు కదిలిపోతుంటాను 
నా నీడకే ఎందుకు కాష్టం పెట్టుకుంటాను 
బుక్కెడు కోపాన్నావుతుంటాను... 
అసత్యపు పదమూ 
అసహ్యపు బులెట్టూ 
కడుపులోపలి నట్టా 
ఒక్కటే నాకు...   


(చిరువి = గ్రీకు మైథాలిజీలో సగం దేహం గల పాత్ర)

1 comment:

paalaagu said...

adhbutham nestam!