Followers

Friday 29 March 2013

మలయ విరాగ మారుతం

ఈ స్వరం బొడ్డును కోసిందెవ్వరు 
గొంతుకు తొలిసారిగ 
                           గమక గన్నేరు పూసిందని 
                           చూసిందని 
                           చెప్పిందెవ్వరు 
రాత్రిని కౌగిలించుకున్న మొదటి ఝాము పాటెప్పుడు 
దండంపెట్టుకుందీ... యాలాడిందీ... 
చీకటి తన నుదుటి బొట్టును 
                           అప్పుడెట్లా సవరించుకుందీ... 

నీకు లాగ... 
మనకొక కలుగులాగ 
మనసొక కరిహంస కాంతిగా... 
చైత్ర గంధంగా 
గులేబకావళి పువ్వుగా 
కిరణ రంజనిగా 
గగనమెక్కిందీ... తూలి... కూలి... 

అమ్మా... నువ్వు పాటతో కన్నందుకు 
వెయ్యి జన్మల రుణమెక్కిననే... 
నీ మెట్టెలనే నాకుతూ బతుకుతూన్న 

పాటై... మాటిచ్చిన నమ్మకమే 
                       అఘోరమయ్యింది 
అవమానాలకు అడ్డుపడింది 
ఆపతిలో ఆదుకుంటున్నది 


ఎటు దొర్లినా... 
ఖేదపడి రక్త మోడుతున్నానా... 
ఖండిత 'సంగతి'నై 
పాలు చేపుతున్నానా భూమికి 
భూమిలోపలి ఔషధాలకు 
మొలకెత్తుతున్నానా 
నీళ్ళు పోస్తున్నానా 

విహ్వలమెక్కలేదు 
ఆరోపణ దొరకలేదు 
లోపల... 
ఎండిన ఇస్తరాకు మీది నీటి బొట్టుగా 
ఒక్కడ్నే స్వర పరుచుకుంటున్నాను 
భూమిని 
భూమిలోపలి వేల ఖనిజాల్ని 

No comments: